కార్డుల్లో ఒకే పేరుండాలి.. లేకపోతే చిక్కులే!

ఆధార్ తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు చెప్తున్నా ప్రభుత్వం ఒక దాని వెంట మరొక పథకానికి అనుసంధానం చేస్తూనే ఉంది. ఆదాయపు పన్ను రిటర్నును దాఖలు చేయాలంటే శాశ్వత ఖాతా సంఖ్య (పాన్)ను, ఆధార్‌తో అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల ఇంటి పేర్లు లేనివారికి, ఈ రెండు కార్డుల్లోనూ పేర్లు ఒకే విధంగా లేనివారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు ఇంటి పేర్లు ఉండవు. తండ్రి పేరునే ఇంటి పేరుగా వాడుకుంటూ ఉంటారు. పాన్ కార్డు జారీ చేసేటపుడు పేరును పూర్తిగా రాయమని అడుగుతారు. పూర్తి పేరునే పాన్ కార్డులో రాస్తారు. పాస్‌పోర్టులో కూడా ఈ విధంగానే ఉంటుంది.

ఆధార్, పాన్ కార్డుల అనుసంధానాన్ని ఆదాయపు పన్ను శాఖ ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌ అంగీకరించడం లేదు. పేరులోని అక్షరాల మార్పుల వల్ల కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొందరి పేర్లు ఆధార్‌ కార్డులోనూ, పాన్ కార్డులోనూ ఒకే క్రమంలో ఉండటం లేదు. ఇది కూడా సమస్యను సృష్టిస్తోంది. ఆన్‌లైన్‌‌లో ఈ రెండు కార్డులను అనుసంధానం చేసుకోవాలనుకునేవారు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం మరింత స్పష్టతనివ్వాలని కోరుతున్నారు.

పేర్లు జత కాకపోవడంపై ఛేంజ్.ఓఆర్‌జీలో ఎం. అర్చునన్ పిటిషన్ పెట్టారు. ‘‘ఎం. అర్చునన్ అని చట్టబద్ధంగా ఆమోదం పొందిన పేరుగల వ్యక్తి, అతని అన్ని లీగల్ డాక్యుమెంట్లలోనూ ఎం. అర్చునన్ అని ఉండగా, పాన్ కార్డుకు ఎలా దరఖాస్తు చేయగలడు?’’ అని ఈ పిటిషన్‌లో ప్రశ్నించారు. మన ప్రభుత్వం తప్పుడు విధానాన్ని అనుసరిస్తోందని ఆరోపించారు. సుమారు పదేళ్ళ క్రితం తాను పొందిన పాన్ కార్డులో తన పేరు అర్చునన్ మరిముత్తు అని ఉందన్నారు. తనకు ఇప్పుడు రెండు ఐడెంటిటీలు ఉన్నాయని, ఆధార్, పాక్ కార్డుల్లో వేర్వేరుగా ఉండడంతో తనకు ప్రభుత్వం ఎలా న్యాయం చేస్తుందని ప్రశ్నించారు. ఇలా ఐటీ రిటర్న్స్ లకు పాన్ , ఆధార్ సమస్య జఠిలంగా మారింది.

To Top

Send this to a friend