కథ క్లైమాక్స్: జైలుకా.. సీఎం సీటుకా..?

తమిళనాడు రాజకీయాలు చివరి అంకానికి చేరుకున్నాయి. తమిళనాడు సీఎం సీటు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న శశికళ ఆశలు నెరవేరుతాయా లేదా అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది.. జయలలిత, శశికళ అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు మంగళవారం ఉదయం 10.30 గంటలకు వెలువడునుంది. దీంతో శశికళ ఈ కేసులో దోషిగా జైలుకు వెళతారా.? లేదా.. నిర్దోషిగా సీఎం సీటు ఎక్కుతారా అన్న సందేహం దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. తమిళనాడులో అయితే పరిస్థితులు ఇంకా వేడిగా ఉన్నాయి. శశికళ జైలుకెళ్తే కంట్రోల్ చేయడం కోసం తమిళనాడు అంతా హై అలర్ట్ ప్రకటించి భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
శశికళ భవిష్యత్ ఏమతుందోనన్న ఉత్కంఠ ఆమెకు సపోర్టు చేస్తున్న 119 ఎమ్మెల్యేల్లో ఉంది. శశికళ కు అనుకూలంగా అయితే సీఎం అవుతారు.. ఒక వేల జైలుకు వెళితే ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోతారు.దీంతో కొత్త వ్యక్తిని సీఎంగా ఎన్నుకోవాల్సి ఉంటుంది.
కాగా ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వంకు రాను రాను మద్దతు పెరుగుతోంది. మంగళవారం వరకు 12 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఆయన వెంట ఉన్నారు. హీరో, దర్శకుడు లారెన్స్ రాఘవ కూడా మంగళవారం పన్నీర్ కు మద్దతు పలికారు. శశికళ జైలుకు వెళితే.. కేంద్రం బీజేపీ అండతో మెజార్టీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునేలా సీనియర్లతో మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కూడా పన్నీర్ నే సీఎం చేయాలని మద్దతిచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. శశికళ జైలుకు గనుక వెళితే ఖచ్చితంగా పన్నీర్ అన్నాడీఎంకే ను చీల్చి సీఎం పీఠం ఎక్కుతాడన్న నమ్మకం ఉంది. ఈ క్రమంలోనే పార్టీ సభ్యులతో సోమవారం అత్యవసర సమావేశాన్ని పన్నీర్ జరిపారు.
కాగా సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో తమిళనాడులో గవర్నర్ ది కీరోల్ కానుంది. ఇప్పటికే కేంద్ర అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ తమిళనాడులో బలపరీక్షకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ కు సూచించారు. బలనిరూపణ సమయంలో శశికళకు మద్దతుపై ఒకటి, పన్నీర్ మద్దతుపై మరొక తీర్మానం పెట్టాలని సూచించారు. శశికళపై సుప్రీంకోర్టు తీర్పు రానున్న నేపథ్యంలో ఈ సూచన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే చేస్తే.. శశికళ జైలుకు వెళితే బలనిరూపణలో డీఎంకే, అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతుతో పన్నీర్ మళ్లీ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అందరూ భావిస్తున్నారు. దీంతో మొత్తానికి ఈరోజు వచ్చే సుప్రీం తీర్పు తమిళ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయనుంది.

To Top

Send this to a friend