ఏపీ ప్రత్యేకహోదా ఉద్యమానికి తెలంగాణ హీరో

కవులు, కళాకారులకు ప్రాంతం, కులం, మతంతో సంబంధం లేదు. ఈ డైలాగులు అంతటా చెప్తారు.. కానీ ఆచరించే మహానుభావులు ఎవరూ ఉండరు.. తాము అన్ని ప్రాంతాల వారికి ఆమోదయోగ్యం అంటారు హీరోలు. కానీ కొన్ని ప్రాంతాల్లోనే తమ సేవలను, ఆడియో ఫంక్షన్లను, ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కలెక్షన్లకు అన్ని ప్రాంతాలు కానీ.. సమస్యలకు కాదు అని హీరోలు మిన్నకుండిపోతారు..

కానీ ఈ తెలంగాణ హీరో ఆదర్శంగా నిలుస్తున్నాడు. తమిళనాడులోని జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో ఏపీ యువత, యువజన సంఘాలు, పవన్ ఫ్యాన్స్ తదితర సంఘాలు వైజాగ్ లోని విశాఖ తీరంలో నిర్వహించనున్న ప్రత్యేక హోదా ఉద్యమంలో తాను పొల్గొనబోతున్నట్టు ట్వీట్ చేశాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.. తాను వైజాగ్ వెళ్లడానికి టికెట్ బుక్ చేసుకున్నానని.. 26న ఆర్కే బీచ్ లో కలుద్దామని.. తాను ఏ రాజకీయ పార్టీకి మద్దతు తెలపడం లేదని.. కేవలం యువత తమహక్కుల కోసం చేస్తున్న పోరాటానికే మద్దతు తెలుపుతున్నట్టు సంపూర్ణేష్ బాబు పేర్కొన్నాడు.

కాగా జల్లికట్టు ఉద్యమంలో స్వయంగా పాల్గొన్న తమిళ హీరోల వలే తెలుగు హీరోలు పాల్గొనాలని హోదా పై ఉద్యమిస్తున్న యువకులు డిమాండ్ చేస్తున్నారు. ట్వీట్లతో సంఘీభావం తెలపడం కన్నా స్వయంగా వైజాగ్ వచ్చి పాల్గొనాలని కోరుతున్నారు. హీరోలు తారక్,  ప్రభాస్,  రానా,  అల్లు అర్జున్, మహేశ్, తదితరులు సంపూర్ణేష్ బాబులా వచ్చి ఉద్యమంలో పాల్గొంటే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి హోదా పై కదలిక వస్తుందని కోరుతున్నారు. హీరోలు వచ్చి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరుతున్నారు. కానీ తారక్,  ప్రభాస్, మహేశ్ తదితరులు వస్తారా రారా అన్నది మిలియన్ల డాలర్ల ప్రశ్న..?

To Top

Send this to a friend