ఏపీకి ఓ కోదండరాం?

హైదరాబాదులో జరగకుండా నిలిచిపోయిన ‘నిరుద్యోగ ర్యాలీ’ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లోనూ సరికొత్త ఆలోచనలను, కోరికలను రేకెత్తిస్తున్నది. నిరుద్యోగ ర్యాలీని కేసీఆర్ సర్కారు ఖాకీల యొక్క ఉక్కు పాదాలతో అణచివేసి ఉండవచ్చు గాక… కానీ.. నిరుద్యోగులు అనుభవిస్తున్న వేదన, క్షోభ నలుగురి దృష్టికీ వెళ్లేలా చేయడం ఒక్కటే వారు సంకల్పించిన ర్యాలీ లక్ష్యం అయితే గనుక వారు సక్సెస్ అయినట్లే. ఇది తెలంగాణ పరిస్థితి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో తటస్థులు, రాజకీయ ఆలోచన పరుల మధ్యలో మరో కొత్త చర్చ నడుస్తోంది. కోదండరామ్ మాదిరిగా పట్టినపట్టు వదలకుండా.. ప్రభుత్వ అప్రజాస్వామిక , అనైతిక చర్యలను ఎండగట్టే నాయకుడు మన రాష్ట్రంలో లేకపోయెనే అని వారు అనుకుంటున్నారు. కోదండరాం వంటి ప్రజల్లో క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు ఏపీలో కూడా ఒక్కరు ఉన్నట్లయితే.. చంద్రబాబు ఆటలు ఇంత విచ్చలవిడిగా సాగుతూ ఉండేవి కాదని చర్చించుకుంటున్నారు.

తెలంగాణ లో కేసీఆర్ సర్కారు ఎంతగా ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తున్నదో.. ఏ కోణంలోంచి చూసినప్పటికీ.. ఏపీలో తెలుగుదేశం సర్కారు అంతకంటె ఘోరంగానే వ్యవహరిస్తున్నదనేది అందరికీ తెలిసిన సంగతే. అయితే అక్కడ ప్రభుత్వ చర్యలను ఎండగడుతూ, ప్రజల్లో కొత్త ఆలోచనను రేకెత్తించగల తటస్థ రాజకీయ లేదా సామాజిక వేదిక అంటూ ఏదీ లేకుండా పోయింది. అది చంద్రబాబునాయుడు అదృష్టం అనుకోవాలి.

ఏపీలో తెలుగుదేశం కాకుండా మిగిలిన రాజకీయ పక్షాల గురించి ఆలోచిస్తే.. భాజపా చంద్రబాబు జేబులో పార్టీలాగానే వ్యవహరిస్తుంటుంది. కాంగ్రెస్ పార్టీ పుట్టగతులు లేకుండా పోయింది. వామపక్షాలు కార్యక్రమాల హడావిడి చేయాల్సిందే తప్ప.. నిజమైన ప్రజాబలం తక్కువ. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతిపక్షం గనుక.. వారు ఏం మాట్లాడినా రాజకీయ స్వార్థంతో మాట్లాడుతున్నారని తాటాకులు కట్టేస్తుంటారు. పవన్ కల్యాణ్ వంటి తటస్థ నాయకులు ఇటీవలి కాలంలో తెరమీదికి వస్తున్నప్పటికీ… ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించే విషయంలో ఆయన తీరు తమలపాకుతో నాలుగు తగిలించినట్లే ఉంటున్నది తప్ప… క్రియాశీలంగా ఉండడం లేదు. నికరంగా నిజాయితీగా మాట్లాడగల ఒక్క నాయకుడైనా ఏపీలో లేడే అని ఆలోచన పరులు అనుకుంటున్నారు.

ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న కొన్ని తటస్థ వేదికలు ఉన్నాయి. వారి మాటలకు , వాదనలకు కొంత క్రెడిబిలిటీ కూడా ఉంది. అయితే వారు కులగజ్జిలో పడి కొట్టుమిట్టాడుతూ రాష్ట్రప్రభుత్వ దౌష్ట్యాల మీద పల్లెత్తు మాట అనడానికి సంశయిస్తూ ఉంటారు. ఇలాంటి చిత్తశుద్ధి గల నాయకులు లేకపోవడం వల్ల.. ఏపీలో సర్కారు ఆటలు విచ్చలవిడిగా సాగుతున్నాయని పలువురు అంటున్నారు. ప్రజల్లో రేగుతున్న అసంతృప్తిని సమీకరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించగల తటస్థ వేదిక అవసరం ఉన్నదని ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్నారు.

To Top

Send this to a friend