ఎరక్కపోయి ఇరుకున్న కేసీఆర్..


ముందుచూపుతో వెళ్లకపోతే ఎంతటి ఉపద్రవం ముంచుకొస్తుందో కేసీఆర్ బాగా అర్థమైంది. సింగరేణి వారసత్వ ఉద్యోగాల విషయంలో ప్రణాళిక లేకుండా.. పకడ్బందీ జీవోలు లేకుండా ముందుకెళ్లి కేసీఆర్ దారుణంగా దెబ్బైపోయారు. నిరుద్యోగుల్లో ఆశలు రేపి ఉసూరుమనిపించారు. సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారుకు చుక్కెదురైంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళితే.. అక్కడ కూడా దెబ్బ తగిలింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. సింగరేణిలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలందరికి ఉద్యోగాలిచ్చుకుంటూపోతే మిగతా నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని గతంలో హైకోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని సమర్థించింది. కార్మికుడు అనారోగ్య కారణాలతో ఉద్యోగానికి అనర్హుడని తేలితే అతని వారసుడికి ఉద్యోగం ఇవ్వచ్చు గానీ.. మొత్తంగా వారసులందరికి ఉద్యోగాలు ఇవ్వడం సరికాదని చెప్పింది.

ఇంతవరకు ఓకే.. కానీ ఇప్పుడు సింగరేణి ప్రాంతంలో టీఆర్ఎస్ దాని అనుబంధ కార్మిక సంఘం తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం పరిస్థితి ఏంటీ..? వారసత్వ ఉద్యోగాలు వస్తాయని చాలామంది యువకులు ప్రవేటు ఉద్యోగాలు వదులుకుని స్వగ్రామాలకు చేరుకున్నారు. వారసత్వ ఉద్యోగాల ప్రకటన తర్వాత.. దీన్ని బేస్ చేసుకుని కోల్ బెల్ట్ ఏరియాలో చాలా పెళ్లిళ్లు కూడా అయ్యాయి. ఇక ఉద్యోగం రావడమే తరువాయి.. భారీగా జీతం లైఫ్ లో సెటిల్ పోవచ్చు అనుకున్నారు. కానీ వారి ఆశలు ఇప్పుడు అడియాశలయ్యాయి.

ఇప్పటికే హైకోర్టు తీర్పుతో కార్మికుల పిల్లల్లో కోపం కట్టలు తెంచుకుంది. సర్కారును పై నుంచి కింది వరకు కడిగిపారేస్తున్నారు. ఇక సుప్రీంకోర్టు తీర్పుతో కోల్ బెల్ట్ ప్రాంతంలోని యువత మరింత రగిలిపోతున్నారు. అసెంబ్లీలో తీర్మానం, రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా లేకపోతే పారిశ్రామిక వివాదాల చట్టం 1947 సెక్షన్12(3) ద్వారా డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వొచ్చని ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ఒక్కచోటికి చేరిన యువత.. సర్కారుపై జంగ్ కు రెడీ అయ్యారు. మంగళవారం నుంచి సమ్మె చేసి తీరుతామని చెబుతున్నారు.

ఇప్పటికే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఇప్పుడున్న పరిస్థితుల్లో కోల్ బెల్ట్ ఏరియాకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు.. ఇప్పటికే సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. మొన్న హైకోర్టు, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ నెలలో ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. వాయిదా వేసేశారు. వచ్చే నెలలోనే కాదు.. వారసత్వ ఉద్యోగాల సమస్య ఓ కొలిక్కి వచ్చే వరకు గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలకు వెళితే అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగలడం ఖాయం. నిన్నటిదాకా సుప్రీంకోర్టులో గెలుపు మనదే అని చెప్పిన సర్కారు.. ఇప్పుడు వారికి ఏ సమాధానం చెబుతుంది..? ఎలా మళ్లీ కోల్ బెల్ట్ ఏరియాలో అడుగు పెడుతుంది. వారసత్వ ఉద్యోగాల పేరుతో తరతరాలు టీఆర్ఎస్ కు దాసోహం అయ్యేలా చేశామని ప్రభుత్వం అనుకుంది. కానీ కోర్టు తీర్పుతో కనీసం గుర్తింపు సంఘం ఎన్నికల్లోనైనా గెలుస్తారా..? లేదా..? అనే సందేహం కలుగుతోంది.

To Top

Send this to a friend