ఎయిర్ టెల్ ఫిర్యాదులు.. జియో ఉచితాలు.. మరీ..?

ఎయిర్ టెల్ తన ఫిర్యాదుల పరంపరంను కొనసాగిస్తూనే ఉంది.. ముఖేష్ అంబానీ దేశ ప్రజలకు ఇచ్చిన 4జీ ఉచిత సర్వీసులను అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉంది.. ఎయిర్ టెల్ సంస్థ.. జియో ఫ్రీ కాల్స్, ఎస్ఎంఎస్, డేటా ఆఫర్ పై కేంద్ర ప్రభుత్వ ట్రాయ్ కి ఫిర్యాదు చేయడం.. ట్రాయ్ .. రిలయన్స్ జియోకు సపోర్టుగా నిలవడంతో ఎయిర్ టెల్ కు మింగుడుపడడం లేదు. జియో ఫ్రీ సర్వీసుల వల్ల తమ ఆదాయం ఘననీయంగా పడిపోతోందని తాము నష్టపోతున్నామని ఎయిర్ టెల్ గగ్గోలు పెడుతోంది. కానీ ప్రజలకు జియో వల్ల ఉచితంగా.. తక్కువ ధరల్లో సేవలందుతున్నాయన్న విషయాన్ని ఎయిర్ టెల్ మరిచిపోతోంది..
ఎయిర్ టెల్ తాజాగా కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కి రిలయన్స్ జియో పై ఫిర్యాదు చేసింది. ముఖేష్ అంబానీ జియో టెలికాం రంగంలో పోటీ ఉండకూడదనే ఉద్దేశంతో మొత్తం ఫ్రీ ఇచ్చారని.. ఇతర టెలికాం ఆపరేటర్లను సంప్రదించకుండానే ఫ్రీ ఆఫర్ ప్రకటించి తమ ఆదాయం చెడగొట్టారని ఫిర్యాదు చేసింది.. జియో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇతర టెలికాం ఆపరేటర్లు తీవ్రం గా నష్టపోయాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ట్రాయ్, జియో కుమ్మక్కై తమను లేకుండా చేస్తున్నాయని ఆరోపించింది..
కాగా ముఖేష్ అంబానీ ఆలోచనల్లో దేశ భవిష్యత్ ఉంది.. ప్రజలకు ఉచితంగా కాల్స్ , డేటా, సేవలు అందిస్తే డిజిటల్ ఇండియా సాకారమవుతుందని ఆయన నమ్ముతున్నారు. విద్యార్థులకు, యువతకు ఫ్రీ ఇంటర్ నెట్, అందుబాటులోకి వచ్చి వారి భవిష్యత్ బంగారు మయమవుతుందని భావిస్తున్నారు. అదే ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్లలో 1 జీబీ డేటా కావాలంటే 250 రూపాయల పైన ఖర్చు చేయాలి ఉంటుంది. వాటికి ఇన్నాళ్లు ఎదురే లేకపోయేసరికి వినియోగదారుల జేబులకు చిల్లు పడింది.. కానీ జియో రంగప్రవేశంతో దేశప్రజలకు ఊరట లభించింది. కోట్లు కొల్లగొడుతున్న ఎయిర్ టెల్, ఐడియా లాంటి సర్వీసులకు ఇది కంటగింపుగా మారింది. డిజిటల్ ఇండియాకు బాటలు వేస్తున్న జియోను ఎలాగైన అడ్డుకునేందుకు ఎయిర్ టెల్ సహా అన్ని కుట్ర పన్నుతున్నాయి. కానీ ముఖేష్ అంబానీ వెనక్కి వెళ్లడం లేదు. తన ఉచిత సర్వీసులను జియో ద్వారా మార్చి వరకు కొనసాగిస్తున్నారు. ఎయిర్ టెల్ ఎన్ని కుతంత్రాలు పన్నినా… ప్రజలకు ఉచిత సర్వీసులను ఇచ్చి తీరుతామని ప్రకటించడం గమనార్హం..
ప్రజలు జియోను స్వాగతిస్తున్నారు. ఇన్నాళ్లు వందలకు వందలు పెట్టి డేటా ఆఫర్లు కొని తమ పనులు చేసుకుంటున్న జనాలకు జియో ఉచిత సర్వీసులు వరంలా మారాయి. ఇప్పుడు 4జీ ఉచిత సర్వీసులను ఇబ్బడిముబ్బడిగా వాడేస్తున్నారు. ఎయిర్ టెల్, ఐడియా తదితర కాస్లీ డేటా ప్యాకులకు మంగళం పాడి జియో బాటపడుతున్నారు. ఎయిర్ టెల్, ఐడియా లు కూడా జియోలాగా దిగిరావాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా జియో, ఎయిర్ టెల్ పోరులో వినియోగదారులకు మాత్రం ఉచిత సేవలు అందుతున్నాయి.

To Top

Send this to a friend