ఎమ్మెల్యే అవ్వాలనుకునేవారికి ఇది

ఎమ్మెల్యే ఆశావహులకు ఇది నిజంగానే శుభవార్త ! పార్టీలు మారి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంతకటే పెద్ద గుడ్ న్యూస్ ఉండదు. ముఖ్యంగా… వలసల నేపథ్యంలో వీలైనంత ఎక్కువ మందికి అవకాశం కల్పించాలనుకుంటున్న ఇరు రాష్ట్రాల్లోని అధికార పార్టీలకు 100 శాతం సంతోషాన్నిచ్చే మాట. నియోజకవర్గాల పెంపుపై అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు అధికార ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. నియోజకవర్గాల పెంపుపై పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేందుకు అనువుగా… భౌగోళిక, ఇతర సంబంధిత గణాంకాలు, పాలనా యూనిట్లలో మార్పులు, చేర్పులతో కూడిన ‘అడ్మినిస్ట్రేటివ్‌ రిపోర్ట్‌’ పంపించాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నుంచి ఉభయ రాష్ట్రాలకు వర్తమానం అందింది.
రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం, టీఆర్‌ఎస్‌ పార్టీలు రాజకీయ అవసరాల రీత్యా ఇతర పార్టీల నుంచి పెద్దసంఖ్యలో నేతలను చేర్చుకున్నాయి. అలాగే, ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న వారూ ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి నియోజక వర్గాలు పెరుగుతాయని, అందరికీ ‘న్యాయం’ జరుగుతుందని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారు. విభజన చట్టం మేరకు నియోజకవర్గాల సంఖ్య పెంచాలని రెండురాష్ట్రాల ప్రభుత్వాలు గత కొంతకాలంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 294 అసెంబ్లీ, 42 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండేవి. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు 25 పార్లమెంటు, 175 అసెంబ్లీ స్థానాలు వెళ్లాయి. తెలంగాణకు 17 పార్లమెంటు, 119 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. ప్రస్తుతం… తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ సంఖ్యను తొమ్మిదికి పెంచబోతున్నారు. అంటే… ఆంధ్రప్రదేశ్‌లో 225, తెలంగాణలో 153 అసెంబ్లీ స్థానాలు అవుతాయి. కేంద్రం నుంచి వర్తమానం వచ్చిన నేపథ్యంలో… నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై కొందరు తెలంగాణ అధికారులు బుధవారం సచివాలయంలో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఈ వారాంతంలోనే అధికారిక ప్రతిపాదనలను కేంద్రానికి పంపిస్తామని, వీలైతే వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ప్రభుత్వవర్గాలు తెలిపాయి.

అసెంబ్లీ నియోజకవర్గాల ఏర్పాటుకు జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటారు. రాష్ట్ర జనాభాను మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్యతో భాగించి ఒక్కో నియోజకవర్గానికి ఎంత జనాభా ఉండాలో నిర్ధారిస్తారు. కొంచెం అటూ ఇటూగా ఒక ప్రామాణిక జనాభాను నిర్ధారించిన మీదట ఆ మేరకు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. అయితే… 2011 జనాభా లెక్కలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినందున, ఆ సంఖ్య ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలా? లేక… 2001 నాటి జనాభా లెక్కల ఆధారంగా విభజించాలా? అనే అంశంపై రెండు రాష్ట్రాలు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులే దీనిని తేల్చాలని అధికారవర్గాలు తెలిపాయి. కొత్త జనాభా లెక్కలను ఆధారం చేసుకుంటే తెలంగాణలో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. జనాభా ప్రాతిపదికపై ముఖ్యమంత్రులు ‘క్లియరెన్స్‌’ ఇవ్వగానే మిగిలిన విధి విధానాలను రూపొందించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది. ఒక దశలో పెద్ద నియోజకవర్గాలను మాత్రం విడదీస్తే సరిపోతుందనే సూచనను కేంద్ర ప్రభుత్వం ఉభయ రాష్ట్రాల ముందుంచింది. కానీ, రెండు రాష్ట్రాలు అందుకు అంగీకరించలేదు. నియోజకవర్గాలను పూర్తిగా పునర్విభజన చేయాల్సిందేనని పట్టుపట్టాయి. దీనికి అంగీకరించిన కేంద్రం ఆ మేరకు ప్రతిపాదనలు పంపాలని బుధవారం ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసింది.

To Top

Send this to a friend