ఈ బ్యాంకులకి బుద్ధి చెప్పాల్సిందే..


గ్లాసుడు పాలు కింద పోయినందుకు కాకుండా గ్లాసు కడిగిన నీళ్ళు కింద పోయాయని ఏడ్చాడని సామెత. ఒక పక్క విజయ్ మాల్యా లాంటి వాళ్ళు వేలకోట్లు ఎగ్గొట్టి జల్సాలు చేస్తుంటే అలాంటి వాళ్ళ వెంట్రుక కూడా పీకలేక పోతున్న బ్యాంకులు, మధ్యతరగతి నడ్డి విరగ్గొట్టడానికి మాత్రం ఎన్నో స్కెచ్ లు వేస్తున్నాయి. నగదు విత్ డ్రాయల్స్ పై చార్జి అంటాడు ఒకడు, బ్యాంకులో మూడు సార్ల కన్నా ఎక్కువ డబ్బు డిపాజిట్ చేస్తే సర్ చార్జ్ అంటాడు ఇంకొకడు, మినిమం బాలన్స్ ఉంచక పోతే ఫైన్, మళ్ళీ దానిమీద సర్వీస్ చార్జ్ అంట. ATM లో లావాదేవీల మీద కోతలు పెడుతున్నాడు ఇంకొకడు. కాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరిపితే టాక్స్ అంటాడు మరొకడు. మన డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు తగ్గించడానికి పోటీ పడే బ్యాంకులు, అదే సాధారణ ప్రజలు తీసుకునే లోన్స్ మీద వడ్డీ మాత్రం బాదుతున్నాయి. అసలు, బ్యాంకులు ఏమి ఆలోచిస్తున్నాయి? మధ్యతరగతి ని ఎంత బాదినా నోరు మూసుకుని ఉంటారనేనా వీళ్ళ ధైర్యం.

ఎన్నో ఏళ్లుగా నిరర్ధక అప్పులు పెరిగిపోతున్నా, బడాబాబులు లక్షల కోట్ల రూపాయలను ఎగవేస్తున్నా, దాన్ని అరికట్టడానికి, అటు బ్యాంకులు కానీ, ఇటు ప్రభుత్వాలు కానీ ఒక్కటంటే ఒక్క పటిష్టమైన చర్య తీసుకున్న పాపాన పోలేదు. పైగా లక్షల కోట్ల బకాయిలని మాఫీ చేస్తున్నారు. బడాబాబుల నిర్వాకాలతో, బ్యాంక్ అధికారుల అవినీతితో వస్తున్న నష్టాలని పూడ్చుకోకుండా కేవలం సామాన్యులని మాత్రమే చార్జీలతో బాదడాన్ని మనం తప్పక వ్యతిరేకించాలి. నోట్లరద్దు అనే దిక్కుమాలిన చర్య కారణంగా మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా బ్యాంకులలో జమ చేయాల్సి వచ్చింది. దానితో మనం బ్యాంకులలో చిక్కుకుపోయాం.. చిక్కాము కదా అని ఇలా ఎడాపెడా చార్జీలు వసూలు చేయడంపై మనం నిరసన తెలపాలి. లేకుంటే మరిన్ని చార్జీలు మనం చెల్లించాల్సివస్తుంది.

బ్యాంకుల అడ్డగోలు చార్జీలకి నిరసనగా, మనం ఒక్కపని చేయవచ్చు. ఇక నుంచి మన శాలరీ బ్యాంక్ లో డిపాజిట్ కాగానే మొత్తం విత్ డ్రా చేసుకుందాం. కొనుగోళ్ళు, చెల్లింపులు అన్నీ క్యాష్ రూపంలోనే చేద్దాం. ప్రభుత్వాలు డిజిటల్ మనీ అని, క్యాష్ లెస్ అని ఊదరగొడుతున్నాయి. మనం మాత్రం బ్యాంకుల దోపిడీకి నిరసగా అన్ని లావాదేవీలు నగదు రూపంలోనే చేద్దాం , అప్పుడు కానీ, అటు ప్రభుత్వాలకి, ఇటు బ్యాంకులకి బుద్ధి రాదు. మధ్యతరగతి మీద చార్జీల బాదుడు తగ్గాలి అంటే బ్యాంకులకి బుద్ధి చెప్పాల్సిందే.

To Top

Send this to a friend