ఇన్నేళ్లలో తొలిసారి రొటీన్ కు భిన్నంగా కేసీఆర్

ఇన్నేళ్ల భారతం.. వేల కోట్ల నిధులు, ఎస్సీ, ఎస్టీలకు కుప్పలు తెప్పల హామీలు.. అయినా వారి బతుకులు బాగుపడ్డవి లేవు.. వారికి కనీస సౌకర్యాలు కలిగిన పాపాన పోలేదు. మరి ఎటుపోతున్నాయి నిధులు.. ప్రజాప్రతినిధులు జేబుల్లోకా..? అధికారుల ఇంట్లోకా..? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన నిధులన్నింటితో స్వాంత్రత్యం వచ్చినప్పటినుంచి నేటివరకు ప్రతీ ఎస్సీ, ఎస్టీలకు ఒక్కో సొంత గృహం నిర్మించవచ్చని సర్వేల్లో తేలాయి. అంతలా దోపిడీ అయిపోయారు ఎస్సీ, ఎస్టీలు.. అందుకే వారి బతుకుల్లో సమూల మార్పులు రావడానికి ఏం చేయాలి.. వాళ్లే చెప్పాలి.. తెలంగాణ సీఎం కేసీఆర్ అదే చేశారు..

కేసీఆర్ రొటీన్ కు భిన్నంగా ఆలోచించారు.. అందరిలా ఎస్సీ, ఎస్టీలకు నిధులు విడుదల చేసి ఊరుకోకుండా ఆ నిధులను, ఎస్సీ , ఎస్టీ ప్రణాళికను క్షేత్రస్థాయిలో నిరుపేదలకు అందేలా ఏం చేద్దామని ఆలోచించారు. ఎవరైతే అదే సామాజిక వర్గంలో పుట్టి ఎమ్మెల్యేలు, నాయకులు ఎదిగారో వారికి అయితే మరింత విపులంగా సమస్య అర్థమవుతుందని.. వారి నిధులు ఎలా ఖర్చు చేయాలో వారినే అడిగితే బాగుంటదని యోచించారు. అంతే శుక్రవారం తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిదులతో సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణలోని అణగారిన ఎస్సీ, ఎస్టీ లకు ఏం కావాలో.. ఏం చేస్తే వారి బతుకులు బాగుపడతాయో ఆ వర్గాల ప్రజాప్రతినిధులే నిర్ణయించాలని సమస్యలను వారి చేతిలో పెట్టారు. ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిదులు సూచించిన పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని కేసీఆర్ వెల్లడించారు.

కాగా ఇదో మంచి సంప్రదాయం.. ఎప్పుడూ కేసీఆర్ ను తిట్టిపోసే ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఈ విషయంలో కేసీఆర్ ను వేదికపైనే మెచ్చుకున్నారు. కాంగ్రెస్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అయితే ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కేసీఆర్ చూపిస్తున్న చొరవను అభినందిస్తున్నాని చెప్పారు. ఇంతలా వారి సంక్షేమం గురించి ఆలోచిస్తున్న సీఎంను కేసీఆర్ నే చూస్తున్నానని.. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ పేర్కొన్నారు. అందుకే కేసీఆర్ రూటే వేరు.. ఎవరి నిధులు వారికి చెందాలనే ఆయన ఆశయం.. ప్రజాప్రతినిధుల తోడ్పాటుతో తెలంగాణ ఎస్సీ, ఎస్టీల జీవితాలు బాగుపడడం ఖాయం..

To Top

Send this to a friend