ఇది కేసీఆర్ మార్క్ మహిళా సమానత్వం


‘ఎంతైనా అరవండి.. గోల చేయండి.. ఆ టీఆర్ఎస్ అధినేత చెవికెక్కవు.. ఆయన తనదాకా వస్తే కానీ దాన్ని పట్టించుకోడు’ అంటుంటారు టీఆర్ఎస్ ముఖ్యులు.. నిజమే అదీ.. ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీ నేతలు ఎన్ని మాటల తూటాలు పేల్చినా కేసీఆర్ ది మౌనమే సమాధానం.. ఎప్పుడూ స్పందించడు.. ఇరుకునపెట్టే సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఏదో ఒక మ్యాజిక్ చేసి తప్పించుకుంటాడు..

మార్చి 8 మహిళా దినోత్సవం.. మహిళలు ఘనంగా జరుపుకున్నారు. మేధావులు, సామాజిక కార్యకర్తలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, రచయితలు, క్రీడాకారిణి లను ఆయా జిల్లాల్లో ప్రజాప్రతినిధులు సన్మానించారు. గట్టిగా పొగిడారు. మహిళా అధికారులను అన్ని చానల్స్ ఇంటర్వ్యూ చేశాయి. ఆహో వోహో అన్నాయి. కానీ రాష్ట్రాన్ని ఏలుతున్న సీఎం కేసీఆర్ మాత్రం కనిపించలేదు.. ఆయన మాటలు వినిపించలేదు.. అక్కడే వచ్చింది చిక్కంతా…

మొదటినుంచి కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలకు చోటు లేదు. అంతా మగఫుంగవులే మంత్రులుగా ఉన్నారు. దీనిపై ఇంటా బయటా ఎన్నో విమర్శలు.. ఆకాశంలో సగం.. జనాభాలో సగం అంటూ ఊదరగొట్టే ప్రసంగాలేనా..? తమకూ తెలంగాణ మంత్రివర్గంలో చోటు లేదా అని ఎంతో మంది ప్రశ్నల వర్షం.. అయినా ఎక్కడ కేసీఆర్ మహిళలకు చోటుపై హామీ ఇవ్వలేదు.. చోటిస్తానని బహిరంగంగా ప్రకటించనూ లేదు..

అందుకే నిన్న జరిగిన మహిళా దినోత్సవం వేళ కేసీఆర్ కనపడకుండా పోయారు. తెలంగాణ మంత్రివర్గంలో మహిళలకు చోటు లేదని ప్రశ్నిస్తారనుకున్నారో ఏమో కానీ కేసీఆర్ మహిళా దినోత్సవాన్ని బహిష్కరించారు. ఆయన ఏ ప్రోగ్రాంలో పాల్గొనలేదు. కానీ తన కూతురుతో కాగల కార్యం సాధించారు..

తెలంగాణ రాష్ట్రసమితి ఎంపీ, సీఎం కూతురు ఎంపీ కవిత మహిళా దినోత్సవంలో పాల్గొన్నారు. నాన్నపై విమర్శలు రాకుండా కవర్ చేశారు. కేసీఆర్ చెప్పారని ఒక విషయాన్ని రిలీజ్ చేశారు. అదేంటంటే.. త్వరలోనే మహిళా మణులు శుభవార్త వింటారాట.. నామినేటెడ్.. ఇతర కార్పొరేషన్ పదవుల్లో మహిళలను నియమించేందుకు కేసీఆర్ ఓకే చెప్పారని వార్త.. నిజంగా ఇది మహిళలను సంతృప్తి పర్చలేదు. ఎందుకంటే మహిళలు కోరుకునేది స్వయం పాలన.. అధికారం.. అది కావాలంటే వారికి మంత్రి పదవులు, సీఎం, తదితర కీలక పదవులు కావాలి.. కానీ ఏదో తాయిలం ఇచ్చినట్టు సెకండ్ కేటగిరీ అయిన కార్పొరేషన్, నామినేటెడ్ పదవులు ఎందుకు అని మహిళలు ప్రశ్నిస్తున్నారు. బిడ్డ కవితకు అత్యున్నత పదవులు ఇచ్చి.. కేంద్రంలో ని రాజకీయాల్లో కీలక బాధ్యతలు అప్పగించిన కేసీఆర్ ఇతర మహిళా ప్రజాప్రతినిధులు విషయంలో దారుణంగా విఫలమయ్యాడని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. బతుకమ్మ లాంటి పండుగల సమయంలో కేసీఆర్ కవిత కు ప్రాధాన్యం ఇచ్చి కోట్లు ఖర్చు చేయిస్తారు. కానీ ఇతర ప్రజాప్రతినిధులకు అందులో ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వరు.. ఇదే కాదు తెలంగాణ ప్రభుత్వంలో అసలు మహిళల ప్రాధాన్యమే లేదనడంలో ఎలాంటి సందేహం లేదు.. తెలంగాణలో కేసీఆర్ మార్క్ మహిళా సమానత్వం అంటే ఇదే మరీ..

To Top

Send this to a friend