ఆమె యాదిలోనే ‘భూమా’ వీడ్కోలు..


ఆమె లేని జీవితం వ్యర్థమనుకున్నాడు. భార్య మరణం అతడిని ఒంటిరిని చేసింది. ఆ వైరాగ్యంలోనే ఉండిపోయాడు. రాజకీయాల్లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఆయన నింపాదిగా ఉండలేకపోయారు. ఆ యాదిలోనే ఈ రోజు పరమపదించారు.. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఈరోజు హఠాన్మరణం చెందడం ఆయన అభిమానులను కృంగదీసింది..

2014 ఏప్రిల్ 24న ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి భార్య శోభ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పటినుంచే మానసికంగా కృంగిపోయిన నాగిరెడ్డికి ఈ ఉదయం 4 గంటల ప్రాంతంలో తీవ్ర గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఆయనను నంద్యాలలోని ఓ ఆసుపత్రికి తరలించారు. వైద్యానికి భూమా దేహం ఎంతమాత్రం స్పందించలేదు. దీంతో చికిత్స పొందుతూ ఆయన మరణించారు..శోభా నాగిరెడ్డి మృతి కి సంబంధించిన చేదు గురుతులు ఇంకా కళ్లముందు కదలాడుతున్న నేపథ్యంలో తండ్రి కూడా మృతిచెందడం వారి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు శోకసంద్రంలో మునిగిపోయారు..

* భూమా నాగిరెడ్డి ప్రస్తానం
రాయలసీమ లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ భూమా నాగిరెడ్డి స్వస్థలం. తండ్రి హత్య తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన భూమా నాగిరెడ్డి 1992లో సోదరుడి మృతి తర్వాత ఉప ఎన్నికల్లో మొదటిసారి ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం మూడు సార్లు ఎంపీగా గెలుపొందారు. అప్పట్లో ప్రధాని పీవీ నరసింహారావు మీద కూడా పోటీచేసి సంచలనం సృష్టించారు.. అనంతరం 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి భూమా నాగిరెడ్డి నంద్యాలలో పోటీ చేసి గెలిచారు. 2016లో కూతురు అఖిల ప్రియతో కలిసి భూమా టీడీపీలో చేరారు. టీడీపీతోనే రాజకీయాలకు గుడ్ బై చెబుతానని మళ్లీ ఓడినా గెలిచినా పార్టీలు మారనని టీడీపీలో చేరే సమయంలోనే తన వైరాగ్యాన్ని వ్యక్తం చేశారు. కూతురు అఖిల ప్రియ .. భార్య శోభ స్థానంలో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆమె స్థిరపడ్డాక పూర్తిగా రాజకీయాలకు దూరమై విశ్రాంతి తీసుకుంటానని నాగిరెడ్డి పలు సందర్భాల్లో చెప్పారు. శోభ చనిపోయాక ఆరోగ్యం దెబ్బతినడంతో నాగిరెడ్డికి బైపాస్ సర్జరీ జరిగింది. అప్పటినుంచి ఆరోగ్యం బాగుండడం లేదు. వారం రోజులుగా అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న విజయవాడలో కూడా చంద్రబాబును కలిసినప్పుడు ఆరోగ్య కారణాలతో ఇబ్బందులు పడ్డారు. చివరకు ఈరోజు పొద్దున తీవ్ర గుండెపోటుతో మరణించారు.

కాగా ఇటీవల చంద్రబాబు మంత్రివర్గ విస్తరణలో భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడానికి నిర్ణయించారు. కానీ గవర్నర్ వైసీపీ నుంచి చేరిన వాళ్లకు వద్దని..రాజీనామాలు చేసి గెలిచాక ఇవ్వాలని సూచించడంతో ఆయన మంత్రి పదవికి దూరమయ్యారు. భూమా అనూహ్యంగా గుండెపోటుతో మరణించడంతో కర్నూలు జిల్లా నాయకులు శోకసంద్రంలో మునిగిపోయారు.

To Top

Send this to a friend