ఆంధ్రకు నీళ్లిచ్చి.. తెలంగాణను ముంచుతావా.?

మళ్లీ తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ మధ్య జలయుద్ధం మొదలైంది. కృష్ణా జలాల్లో వాటా సమస్యను తేల్చేయాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల ఏకే బజాజ్ కమిటీ ఈ వివాదం పరిష్కరించడం తమతో సాధ్యం కాదని సీఎం కేసీఆర్ కు స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో ఏకే బజాజ్ కమిటీ రెండు రాష్ట్రాల నీటిపారుదల అధికారులు ఆ తర్వాత సీఎం కేసీఆర్ తో సమావేశమైంది. గోదావరి నుంచి కృష్ణా నదికి పోలవరం, వట్టిసీమ ద్వారా తరలించే జలాల అంశంపై తమ పరిధిలోకి రాదని.. తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు స్పష్టం చేసింది. దీంతో ఈ సమస్యను కేంద్రం వద్దే తేల్చుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు. వెంటనే ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావును ఢిల్లీకి పంపాలని.. కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.
గోదావరి నుంచి కృష్ణాకు నీటిమళ్లింపులో జోక్యం చేసుకోబోమని..ఈ అంశాన్ని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చూసుకుంటుందని ఏకే బజాజ్ కమిటీ కేసీఆర్ కు స్పష్టం చేసింది. దీనిపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి వాటా వినియోగానికి సంబంధించి ఓ విధానం రూపొందించాలని.. ఆ విధానం లేక తరతరాలుగా తెలంగాణకు నీటి పంపిణీలో అన్యాయం జరుగుతోందని కేసీఆర్ వారితో ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీటి వినియోగానికి సంబంధించి ఆపరేషన్ రూల్స్ లేవని.. దీనివల్ల ఆంధ్రాకు నీళ్లు.. తెలంగాణకు కడగండ్లు మిగులుతున్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి పంపకాలను తేల్చాల్సిన బజాజ్ కమిటీ చేతులెత్తేయడం.. ఆంధ్రా ప్రాజెక్టులపై నోరు మెదపకపోవడంపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణ నీటి విషయంలో అన్యాయానికి గురి అవుతుందని.. కేంద్రం కమిటీ వేసినా వారు ఆంధ్రా ప్రయోజనాల కోసమే పనిచేస్తూ సమస్యను పరిష్కరించకపోవడం దారుణమని అధికారులతో వ్యాఖ్యానించినట్టు తెలిసింది..

To Top

Send this to a friend