అమ్మ కలను నిజం చేస్తానంటున్నాడు..

మొన్న అర్ధరాత్రి .. టైం తెలియదు.. తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం గాఢ నిద్రలో ఉన్నారు. అప్పుడే ఇటీవలే చనిపోయిన మాజీ సీఎం జయలలిత.. తన అనుంగ శిష్యుడు నమ్మిన బంటు పన్నీర్ సెల్వంకు కలలో కనిపించి హితబోధ చేసిందట.. ‘నాయనా.. శశికళను సీఎంను చేయొద్దు.. ఆమె వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు.. వెంటనే నువ్వే నా సీట్లో కూర్చో’ అని అమ్మ పలికిందట.. దీంతో రెడీ అయిపోయాడు.. పన్నీర్ సెల్వం మళ్లీ తమిళనాడు సీఎం అవుతానని.. తన రాజీనామాను వెనక్కి తీసుకుంటానని స్పష్టం చేశారు. పన్నీర్ సెల్వం తిరుగుబావుటాతో తమిళ రాజకీయాలు మలుపుతిరిగాయి..
ఆదినుంచి అన్నాడీఎంకే పార్టీలో అమ్మ జయలలిత గుత్తాధిపత్యం చెలాయించేది. నెచ్చలి శశికళ ను జయ తమిళ రాజకీయాలకు దూరంగా ఉంచేవారు. ఆమెకు ఏ పదవి ఇచ్చేవారు కాదు.. తన నమ్మిన బంటు , శిష్యుడు అయిన పన్నీర్ సెల్వంనే జయలలిత నమ్మి తాను జైల్లో ఉన్నప్పుడు తమిళనాడు సీఎంను చేశారు. జయ మరణం తర్వాత కూడా పన్నీర్ సెల్వంమే సీఎం అయ్యారు. కానీ జయ నెచ్చలి శశికళ పన్నీర్ ను ఆ పదవిలోంచి బలవంతంగా రాజీనామా చేయించి దించేయడం.. దీనికి పన్నీర్ అలకబూని నిన్న చైన్నై మెరీన్ బీచ్ లో అమ్మ సమాధి వద్ద మౌన దీక్ష దిగడం జరిగిపోయింది..
తమిళనాడు రాజకీయాలను తనకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ ప్లాన్ చేసింది.. అందుకే పన్నీర్ సెల్వంను తమిళనాడు సీఎం పదవి నుంచి దించి తాను ఎక్కాలనుకున్న శశికళ ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది.. గవర్నర్ విద్యాసాగర్ రావు.. చైన్నైకి వెళ్లకుండా లాబీయింగ్ చేసింది. అనంతరం పన్నీర్ సెల్వంతో ‘అమ్మకల్లోకి వచ్చింది’ అనే సెంటిమెంటును ప్రయోగించింది. పన్నీర్ తో తిరుగుబావుట ఎగురవేసి శశికళ సీఎం ఆశలపై నీళ్లు చల్లింది. పన్నీర్ ఇటీవల వరుసగా మోడీని కలవడం.. కమల దళ విస్తరణకు అనుకూలాంశాలు తోడవడంతో మోడీ ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. తనను శరణు కోరిన పన్నీర్ కోసం తమిళ రాజకీయాలను మలుపుతిప్పారు.

To Top

Send this to a friend