అమెరికాలో తెలుగువారి దారుణ హత్య

అమెరికాలో జాత్యంహకార దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ స్థిరపడ్డ తెలుగువారికి, భారతీయులకు రక్షణల లేకుండా పోతోంది.. అమెరికాలో తెలుగు టెకీ శ్రీనివాస్ కూచిభొట్ల హత్యోదంతం మరువకముందే మరో దుర్ఘటన జరిగింది. బర్లింగ్టన్‌లో నివసించే తెలుగు కుటుంబంలో దారుణం జరిగింది. తల్లీ కొడుకు దారుణ హత్యకు గురయ్యారు. అత్యంత పాశవికంగా వారిద్దరి గొంతులు కోసి దుండగులు తమ కిరాతకాన్ని ప్రదర్శించారు.

అమెరికాలోని బర్లింగ్టన్‌లో నర్రా హనుమంతురావు.. భార్య శశికళ (38), ఆరేళ్ల కుమారుడు హనీశ్ సాయితో నివసిస్తున్నారు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి ఆఫీసు నుంచి వచ్చిన హనుమంతురావు ఇంటికి చేరుకున్నాడు. భార్య ఎంతకూ తలుపుతీయకపోవడంతో పక్కింటి వారి సాయంతో ఇంటి తలుపులు పగలగొట్టారు. ఇంటి తలుపులు తీసి చూసే సరికి రక్తపు మడుగులో శశికళ, హనీశ్ సాయి కుమారుడు చనిపోయి కనిపించారు. గొంతులు తెగిపోయి, నిర్జీవంగా పడి ఉన్న వారిని చూసిన హనుమంతురావు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగులు ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డారనే విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు.

జాత్యాహంకార దాడా.. లేక దోపిడీకి వచ్చి వారు అడ్డుకోవడంతో చంపేశారా అనేది విశ్లేషిస్తున్నారు. కేసు నమోదు చేసి అమెరికా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా, పర్చూరు మండలం, తిమ్మరాజు పాలెంకు చెందిన వాళ్లు కొన్నేళ్ల క్రితమే అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. కాగా ఈ విషయం తెలిసిన వారి కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు.

To Top

Send this to a friend