అమెరికన్లే మన శరణుజొచ్చిన వేళ..

మనం చాలా గ్రేట్ అనడం లో ఎలాంటి సందేహం లేదు.. ఎందుకంటే బ్రిటీష్, అమెరికన్ల తెలివితేటలను తోసిరాజని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చరిత్ర సృష్టిస్తోంది. ఒకే సారి నింగిలోని 104 ఉపగ్రహాలను ప్రవేశపెట్టబోతోంది.. ఇందులో అమెరికన్లకు చెందిన 96 ఉపగ్రహాలు, ఇజ్రాయిల్, కజికిస్తాన్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యూఏఈకి చెందిన ఒక్కో ఉపగ్రహం ఉంది.
టెక్నాలజీ అంటే అమెరికాదే అయినా మనం ఈ విషయంలో వారిని అధిగమించాం. 1970 ప్రాంతంలో కేవలం నింగిలోకి రాకెట్ ను పంపడానికే అపసోపాలు పడిన భారత్ ఇప్పుడు ఏకంగా 104 ఉపగ్రహాలను ఒకేసారి పంపుతోందంటే మన స్టామినాను అర్థం చేసుకోవచ్చు.. అంతరిక్ష ప్రయోగాల్లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టడంలో ఇప్పుడు ప్రపంచంలో భారతదేశాన్ని మించిన మగాడు లేడనడంలో ఎలాంటి సందేహం లేదు. మన ఇస్రో రూపొందించిన పీఎస్ఎల్వీ వాహన నౌక ఇప్పటివరకు ఫెయిల్ కాలేదు. ప్రతిసారి ఉపగ్రహాలను ప్రవేశపెడుతూనే ఉంది. ఓటమి ఎరుగని ఇస్రోకు ఇప్పుడో పెద్ద సవాల్.. అదే ఒకేసారి 104 ఉపగ్రహాల ప్రయోగం.. అది విజయవంతం అయితే ఇక నింగిలో మనకు తిరుగుండదు. అమెరికా లాంటి అగ్రదేశం నింగిలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టడంలో అప్పుడప్పుడూ విఫలమవుతోంది. వారి రాకెట్లు ఫెయిల్ అవుతున్నాయి. అలాంటిది ఇండియా ఓటమి ఎరుగకుండా ప్రతిసారీ రాకెట్లను పంపుతూ ఉపగ్రహాలను ప్రవేశపెడుతూ విజయాలను సాధిస్తోంది.

అందుకే అమెరికా మన శరణు జొచ్చింది. అమెరికాకు చెందిన 96 ఉపగ్రహాలను ఇస్రో ఈరోజు నింగిలోకి పంపుతోంది. అంతేకాదు.. ప్రపంచంలోనే అత్యంత చౌకగా నింగిలోకి ఉపగ్రహాలను పంపుతోంది అమెరికాలో అయితే ఇదే ప్రయోగాలకు వేల కోట్లు ఖర్చు చేస్తారు. కానీ భారత్ కేవలం 500 కోట్ల ఖర్చులోపే వీటన్నింటిని పంపుతోంది. అందుకే విదేశాలన్నీ భారత్ నుంచే ఉపగ్రహాలను పంపుతూ భారత్ కు విదేశీ మూలధనాన్ని సంపాదించిపెడుతున్నాయి.. ఇస్రో వల్ల భారత్ కు ఇంటా బయట పేరుతో పాటు.. డబ్బులు వస్తున్నాయి.

To Top

Send this to a friend