గవర్నర్ పిలుపు శశికళ వర్గానికే.

 

తమిళ రాజకీయాల్లో వారం పదిరోజులుగా కొనసాగుతున్న అనిశ్చితికి గవర్నర్ విద్యాసాగర్ రావు తెరదించబోతున్నట్టు సమాచారం. శశికళ వర్గీయుడైన, అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన పళనిస్వామిని ఈ ఉదయం 11.30 వచ్చి కలవాల్సిందిగా గవర్నర్ విద్యాసాగర్ పిలుపునివ్వడంతో ఆయననే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ కోరే చాన్స్ ఉంది.. పళని స్వామిని గవర్నర్ పిలవడంతో శశికళ వర్గం సంబరాలు చేసుకుంటోంది.. పళనిస్వామితో పాటు ఐదుగురు నేతలు రాజ్ భవన్ కు బయలు దేరి వెళ్లారు.
కాగా గవర్నర్ విద్యాసాగర్ రావు నిర్ణయం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆదినుంచి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కనుసన్నల్లో వ్యవహరిస్తున్న గవర్నర్ విద్యాసాగర్ రావు .. పన్నీర్ ను సీఎం చేస్తారని అంతా భావించారు. శశికళను సీఎం కాకుండా అడ్డుకునేందుకు ఎన్ని విమర్శలు వచ్చినా జాప్యం చేశారు. చివరకు శశికళ జైలు పాలు అయ్యాక తీరిగ్గా గవర్నర్ ఈరోజు మళ్లీ శశికళ వర్గాన్నే పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే సమయంలో పన్నీర్ కు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో వారు నిరాశలో కూరుకుపోయారు.
కాగా పళని స్వామి గవర్నర్ ను కలిసేందుకు వెళుతూ.. గవర్నర్ అవకాశం ఇస్తే ఈరోజే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని.. తన వెంట 124 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పుకొచ్చారు. దీంతో శశికళ జైలుకు వెళ్లినా ఆమె నమ్మినబంటు పళనిస్వామి తమిళనాడు సీఎం పదవి చేపట్టబోతున్నారు. దీంతో ఓ రకంగా శశికళేదే తమిళరాజకీయాల్లో ఆధిపత్యం కొనసాగుతుందని చెప్పవచ్చు..

To Top

Send this to a friend