అనువాదాలు.. అనునయాలు.. హామీలు.. కాంగ్రెస్ తెలంగాణ కథ..

‘తెలంగాణ మేమే ఇచ్చాం.. తెలంగాణ కోసం మేమే పోరాడాం. కేసీఆర్ హైజాక్ చేశాడు. మోసం చేశాడు. తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. హామీలు నెరవేర్చడం లేదు.. ’ ఇది రాహుల్ గాంధీ సంగారెడ్డి ప్రజాగర్జనలో ఆరోపణలు.. నిజమే అదే కేసీఆర్ 2014కు ముందు సోనియా వద్దకు వచ్చి టీఆర్ఎస్ విలీనంపై మాట్లాడితే ఆయన్ను పట్టించుకోలేదు. ఏదో ఎంపీ సీటు ఇస్తాం.. సీఎం సీటు ఇవ్వమని సోనియా కేసీఆర్ కు చెప్పి లైట్ తీసుకుంది. కానీ కేసీఆర్ కాంగ్రెస్ ఆఫర్ ను తిరస్కరించి ఒంటరిగా బరిలోకి దిగి తెలంగాణ సీఎం అయ్యారు.. ఇప్పుడు ఏకు మేకు అయ్యాడు. కాంగ్రెస్ కే పుట్టగతులు లేకుండా చేస్తున్నారు.

కేసీఆర్ మొండి జగమొండి.. తెలంగాణ గుట్టు మట్లు తెలుసు.. అందుకే స్నేహహస్తం ఇవ్వని కాంగ్రెస్ ను టార్గెట్ గా ఎన్నికల బరిలో దిగారు. తెలంగాణ ఉద్యమాన్ని ఎజెండాగా పక్కనపెట్టి జనరంజక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వస్తే ఏం చేస్తానో చెప్పాడు. అంతటితో ఆగలేదు. తెలంగాణ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక చూపించాడు. పింఛన్లు, మిషన్ కాకతీయ, భగీరథ, రేషన్ ఇలా ఎన్నో పథకాలు ప్రకటించాడు. జనాల్ని ఆకట్టుకున్నాడు.

కానీ ఇదే కాంగ్రెస్ గడిచిన 2014 ఎన్నికల్లో ఇవేమీ చేయలేదు. పాత చింతకాయపచ్చడిలా తెలంగాణ సాధించింది మేమే అన్న ఒక్క నినాదంతో పోయింది. జనాలకు కావాల్సింది పాత ముచ్చట కాదు.. తెలంగాణ అభివృద్ధి ముచ్చట.. అందుకే గడిచిన తెలంగాణ సాధించింది ఎవరూ అని జనం చూడలేదు. బంగారు తెలంగాణకు బాటలు వేసే కేసీఆర్ ను చూశారు. అధికారం ఇచ్చారు. ఇప్పుడు అధికారం దూరమయ్యాక రాహుల్ సహా అందరూ ఎంత ఆడిపోసుకున్నా ఏం లాభం. అంతా అయిపోయింది. పోనీ 2019 ఎన్నికలకైనా ప్రణాళిక బద్దంగా వెళ్తున్నారా అంటే అదీ లేదు. అవే ఆరోపణలు కేసీఆర్ ను తిట్టడం.. తిడితే గెలవరు.. ప్రజల్లోకి వెళితే గెలుస్తారు. కేసీఆర్ హామీలు ఎండగడితే గెలుస్తారు.. వారికి భరోసానిచ్చి కేసీఆర్ అపజయాలపై నిలదీస్తే గెలుస్తారు. కానీ నేలవిడిచి సాము చేస్తున్న కాంగ్రెస్ ఎన్ని బహిరంగ సభలు నిర్వహిస్తున్నా అవి బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.

To Top

Send this to a friend