అతివాదికే యూపీ పీఠం.. ఎందుకంటే..


యోగి ఆదిత్యనాథ్.. కరుడుగట్టిన హిందుత్వ వాది.. అప్పట్లో బాలీవుడ్ అగ్రహీరో షారుఖ్ ఖాన్ ముస్లింలకు అనుకూలంగా మాట్లాడితే ఇదే ఆదిత్యనాథ్ షారుఖ్ పై విరుచుపడ్డాడు. ‘షారుఖ్ ఉగ్రవాది హఫీజ్ సయిద్ భాషలో మాట్లాడుతున్నాడు.. ప్రజలు నీ సినిమాలు చూడకపోతే రోడ్డున పడతావ్’ అని వ్యాఖ్యానించి దుమారం రేపారు.. అంతేకాదు.. ‘హిందువులను క్రైస్తవంలోకి మార్చేందుకు మదర్ థెరిసా భారత్ కు వచ్చారని..’ నోబల్ శాంతి బహుమతి గ్రహీతకు మతం రంగు పులిమారు. ఘర్ వాపసీ ఉద్యమానికి మద్దతు తెలిపి యూపీని, భారత్ ను హిందూ రాష్ట్రంగా మార్చేంతవరకు విశ్రమించనని చెప్పిన హిందుత్వవాది..

* యోగి ఆదిత్యనాథ్ ప్రస్తానం..
ఇంత దారుణమైన మతచాందసవాదిగా పేరున్న యోగి ఆదిత్యనాథ్ కు యూపీ పగ్గాలు అప్పగించడం దేశం వ్యాప్తంగా సంచలనం రేపింది.. ప్రస్తుతం గోరఖ్ పూర్ ఎంపీగా ఉన్న యోగి ఆదిత్యనాథ్.. అక్కడే హిందువుల ఎజెండాకు ప్రతినిధిగా ఉన్నారు. ‘హిందూ యువ వాహిని’ని స్థాపించి హిందుత్వ ప్రచారం చేస్తున్నారు. గోరఖ్ పూర్ పట్టణంలో 52 ఎకరాల సువిశాల ప్రాంగణంలో గోరఖ్ నాథ్ మఠం ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. 1998లో తొలిసారిగా 26ఏళ్ల వయసులో గోరఖ్ పూర్ ఎంపీగా బీజేపీ తరఫున పోటీచేసి లోక్ సభలో అడుగుపెట్టారు. ఇప్పటికి వరుసగా ఐదుసార్లు ఎంపీగా గెలిపొందుతూ వచ్చారు. హిందువులపై ఎక్కడ చిన్నదాడి జరిగినా ఆయన అక్కడ అనుచరులతో వాలి న్యాయం కోసం పోరాడుతారు. 2007లో మత ఘర్షణల్లో అరెస్ట్ అయ్యి 15రోజులు జైల్లో ఉన్నారు.

*ఆర్ఎస్ఎస్ ఆదేశాలతోనే యోగి సీఎం..
యూపీ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీకంటే కూడా ఆర్ఎస్ఎస్ నేతలందరూ బూత్ స్థాయి నుంచి బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేసి విజయం సాధించిపెట్టారు. యూపీలో ఆర్ఎస్ఎస్ ఒత్తిడికి తలొగ్గే మోడీ ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టికెట్ ఇవ్వలేదు. యూపీలో గెలిస్తే రామమందిర నిర్మాణంతో పాటు ఆయోధ్య, కాశీ వివాదాలను కూడా సునాయసంగా పరిష్కరించవచ్చని ఆర్ఎస్ఎస్ భావించింది. అందుకే బీజేపీ కన్నా ఎక్కువగా ఆర్ఎస్ఎస్ శ్రమించి యూపీలో విజయం సాధించింది. అందుకే ఇప్పుడు తమకు అనుకూలురైన వారిని సీఎం చేయాలని మోడీ, అమిత్ షాలపై ఒత్తిడి తెచ్చింది. అందుకే మఠాధిపతి, హిందుత్వవాది అయిన యోగి ఆదిత్యనాథ్ ను సీఎం చేయాలని మోడీ-షాలపై ఒత్తిడి తీవ్రతరం చేసింది. దీంతో మోడీ ఒప్పుకోక తప్పలేదు. కానీ మోడీ నిజానికి అన్నివర్గాలకు ఆమోదయోగ్యుడైన వారిని సీఎం చేయాలని నిర్ణయించినా చివరకు ఆర్ఎస్ఎస్ ఒత్తిడికి తలొగ్గక తప్పలేదు.

*2019 ఎన్నికలే టార్గెట్ గా పదవులు
బీజేపీ 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే తమను గెలిపించిన ఆయా వర్గాల అభిమతానుసారం సీఎం, డిప్యూటీ సీఎం పోస్టులను కట్టబెట్టింది. యూపీలో గట్టి పట్టున్న, అగ్రకులం అయిన రాజ్ పుత్ వర్గానికి చెందిన ఆదిత్యనాత్ ను సీఎం చేశారు. ఆ తర్వాత బీజేపీకి ఎక్కువగా ఓట్లు వేసిన ఓబీసీ, బ్రాహ్మణ వర్గాలను సంతృప్తి పరిచేందుకు ఆ వర్గాలకు చెందిన బీజేపీ యూపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మలకు డిప్యూటీ సీఎం పదవులు కట్టబెట్టింది. యూపీలో అధికారంలోకి రావడానికి ఈ మూడు వర్గాలే బీజేపీకి సపోర్టు చేశాయి. అందుకే వీరినే ముందుపెట్టి 2019 ఎన్నికల్లోనూ బీజేపీ గెలవాలని ఈ కూర్పు చేసినట్టు తెలిసింది.

To Top

Send this to a friend