అంగన్ వాడీలు, బాలింతల కష్టాలు తీరాయి..


ఎన్నో రోజుల నుంచి వాళ్లు కొట్లాడుతున్నారు.. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే అంగన్ వాడీ సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. అప్పటినుంచి ఇప్పటివరకు వాళ్లను పట్టించుకున్న పాపాన పోలేదు.. కానీ కేసీఆర్ కరుణించారు..

కేసీఆర్ కొత్త నివాసం ప్రగతి భవన్ లో జనహిత పేరిట ప్రజలను కలిసే పనిలో కేసీఆర్ నిమగ్నమయ్యారు. ప్రతివారం ఒక్కో గ్రూపు ప్రజలతో మమేకమై వారి కష్టాలు తీరుస్తూ బాధలను పంచుకుంటున్నారు. వరాలు కురిపిస్తున్నారు. అందులో భాగంగానే ఆదివారం అంగన్ వాడీలతో సమావేశమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల అంగన్ వాడీ బాధ్యులను హైదరాబాద్ రప్పించి వారి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా వరాలు కురిపించారు.

అంగన్ వాడీ కార్యకర్తల హోదాను అంగన్ వాడీ టీచర్లుగా మార్చుతూ వేతనాలను ఇప్పుడున్న 6500 నుంచి ఏకంగా 10500కు పెంచారు. ఏప్రిల్ 1 నుంచి పెరిగిన వేతనాలే అంగన్ వాడీలకు అందుతాయి. అంతేకాదు.. బాలింతలకు కూడా వరాలు కురిపించారు. తెలంగాణ భావి వారసులను కనే తెలంగాణ తల్లులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవమైతే రూ.12 వేలు బహుమానంగా ఇస్తామని ప్రకటించారు. ఆడపిల్ల పుడితే రూ.1000 అదనంగా ఇస్తారు. అంతేకాదు.. గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం, పాలు, గుడ్లు పెంచబోతున్నారు. ఎంత ఖర్చయినా భరిస్తామని కాన్పు వరకు ఏ పనిచేయకుండా ప్రభుత్వమే పోశించేలా కార్యచరణ రూపొందిస్తామన్నారు. అంతేకాదు.. అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు రూ.2 వేల విలువైన కిట్ ను అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. అంగన్ వాడీల్లో కూడా సన్నబియ్యమే సరఫరా చేస్తామని తెలిపారు. దీంతో అంగన్ వాడీలు ఉబ్బితబ్బి అయ్యి ఈ కొత్త పథకాలకు కేసీఆర్ పేరే పెట్టాలని కోరడంతో నవ్వి కేసీఆర్ పరిశీలిస్తామని చెప్పారు. ఇలా జనహితతో తెలంగాణలో చాలారోజులుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను కేసీఆర్ స్వయంగా పాల్గొని పరిష్కరిస్తున్నారు.

To Top

Send this to a friend